పత్రాలు

Wednesday, February 4, 2015


మసాలా మంత్రగాడు
అతడొక మంత్రగాడు
రైల్వేస్టేషన్, బస్సుస్టేషన్, సినిమాహాలు, పబ్లిక్ పార్కు మనవాడికి చిరునామాలు
నా ప్రతి సాయంత్రపు సంధ్య ప్రయాణంలో అతడొక మజిలీ
నా కళ్ళు అతనికోసం అప్రయత్నంగా వెతుకుతాయి
సూర్యుడికి వీడ్కోలంటూ చంద్రునికి స్వాగతం చెపుతూ
సహజంగా అతని మంత్రవిద్య ప్రారంభమవుతుంది
మూడుకర్రల వెదురుకుర్చీ అతని మంత్రాలకు వేదికవుతుంది
కొండెక్కినట్టుండే దీపపు కిరోసిన్ చిమ్నీ
ఒలంపిక్ క్రీడల ప్రారంభపు కాగడా అవుతుంది
ముంతలోని మంటని చూసినపుడతడు నిత్యాగ్నిహోత్రుడనిపిస్తాడు
కాగితం అతని దగ్గర శంకువవుతుంది 
మురమురాలతని దగ్గర ముత్యాలవుతాయి
చేయంత మురమరాలు, ఉడకేసిన శనగలు
వేయించిన పల్లీలు, కరకరలాడే బఠానీలు,
కూసింత కరివేపాకు, కాసింత కొత్తిమీరి
చిటికెడు ఉప్పు, వేలిచివర వెలిగారమ్,
గుప్పెడంత ఉల్లిముక్కలు, గిలకరించిన నిమ్మరసం
అతని చేతి లాఘవం అబ్బురమనిపిస్తుంది
మెలి తిరిగిన చెయ్యేమిటో కళ్ళెదుటే కనిపిస్తుంది
చిత్రంగా విచిత్రంగా సూక్ష్మంలో మోక్షం అవగతమవుతుంది
ఆహుతుల నోళ్ళన్నీ నీళ్ళ చెలమలవుతాయి
అద్భుతం ఆవిష్కృతమవుతుంది, నలభీమం తయారవుతుంది     
అరక్షణంలో అమృతం, అయుదు రూపాయల షడ్రసోపేతం 
అతనిచ్చే తాటాకు ముక్క లు స్టీలు చెంచాలను వెక్కిరిస్తాయి
అతని మంత్రక్షేత్రంలో అడుగు పెట్టారా ?….
చాలిక, మీ నాసిక మీ నడకనతని వైపు శాసిస్తుంది
మీరు సైతం జఠరాగ్నికి అల్పాహారమొక్కటి ఆహుతిస్తారు
ఏమైనా అతనొక మనిషంటు రాయి 
నా ప్రతి సాయంత్రపు నేస్తం, మధ్యతరగతి చిరుదరహాసం
గజవల్లి పవన్ కుమార్
                                                                                      9246649522
pavan_padma97@yahoo.co.in

No comments:

Post a Comment